ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెనుప్రమాదం

నిత్యం రోడ్డు ప్రమాదాలు అందర్నీ కలవరపెడుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు అందరికి టెన్షనే. ఆ తరహా లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా వెళ్లినప్పటికీ అవతలి వ్యక్తి ఎలా వస్తున్నాడో తెలియని పరిస్థితి. మితిమీరిన వేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం సేవించి డ్రైవ్ చేయడం , నిద్ర మబ్బు ఇలా పలు కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజాగా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం స్టేజి దగ్గర జాతీయ రహదారి 44పైన ప్రైవేట్ సీఎంఆర్ వోల్వో బస్సుకు భారీ ప్రమాదం తప్పింది. టైరు ఊడిపడి మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన సీఎంఆర్ ఎక్స్ ప్రెస్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ముందర టైరు ఊడిపోవడంతో రోడ్డు రాపిడి వల్ల మంటలు చెలరేగడంతో వెంటనే డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులను దించేశాడు. ఫైర్ గన్‌తో మంటలను ఆర్పి వేయడంతో ఘోర ప్రమాదం తప్పినట్లు తెలిపాడు. ఘటన సమయంలో బస్సులో 30 నుండి 35 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు.