ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో..కేంద్రం తీరు ఫై మండిపడ్డ కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్రం తీరు ఫై మండిపడ్డారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రాలను ఆర్దికంగా బలహీనపర్చే కుట్ర చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రాలపైన ఆర్దిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. కేంద్ర వైఖరి తెలంగాణకు గుదిబండగా మారిందన్నారు. కేంద్రం కారణంగా ఏడాదికి అయిదు వేల కోట్ల నష్టం జరుగుతోందని చెప్పారు. సంస్కరణల పేరుతో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం సూచిస్తోంది..అందుకు తాను సిద్దంగా లేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని హెచ్చరించారు. దేశంలో మతపిచ్చి తప్ప మరేదీ లేదని వాపోయారు. సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ల నుంచే వివక్ష ప్రారంభమైందని, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టిందని, దీంతో లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయామన్నారు. దీంతో కేంద్రం అప్రజాస్వామిక వైఖరిని నిరసిస్తూ బంద్ పాటించాల్సి వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆనాటి నుంచి నేటివరకూ మన రాష్ట్ర హక్కుల సాధనకు కేంద్రంతో ఏదో రకంగా పోరాటాన్ని కొనసాగించాల్సి వస్తున్నది. ఐదేళ్లపాటు హైకోర్టు విభజన చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. మన హైకోర్టు మనకు ఏర్పాటైన తర్వాత అవసరమైన సిబ్బందిని, నిధులను, భవనాలను సమర్థవంతంగా సమకూర్చుకున్నాం. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి చేసిన కృషికి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశంసించారు’ అని తెలిపారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం ఖాతరు చేయలేదు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు ఇవ్వాలని నేనే స్వయంగా అనేకమార్లు ప్రధాన మంత్రికి విన్నవించినా ప్రయోజనం శూన్యం. కరోనాతో దేశం ఎంతటి ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కొన్నదో అందరికీ తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కూడా కేంద్రం రాష్ట్రాలకు నయాపైసా అదనంగా ఇవ్వలేదు. పైగా న్యాయంగా రావల్సిన నిధులపై కూడా కోత విధించిందని కేసీఆర్ అన్నారు.

75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించిందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యమని చెప్పారు. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణమంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు.