రేపు విద్యాసంస్థ‌ల‌కు , ప్రభుత్వ ఆఫీస్ లకు సెలవు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సర్కార్

తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని.. రేపు తెలంగాణ ప్ర‌భుత్వం సెల‌వు ప్ర‌క‌టించింది. శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు సెలవు రోజుగా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉస్మానియా యూనివర్సిటీ శనివారం సెలవుదినంగా ప్రకటించింది. యూనివర్సిటీ పరిథిలోని అన్ని కాలేజీలకు ఇది వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రేపు ప‌బ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగుర‌వేయ‌నున్నారు. అనంత‌రం బంజారాహిల్స్‌లో ఆదివాసీ, బంజారా భ‌వ‌నాల‌ను ప్రారంభించ‌నున్నారు. ఇక మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించ‌నున్నారు.

కేసీఆర్ సభ కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. కావున ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్​టీఆర్​ స్టేడియానికి 2,300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానికం వస్తారని ట్రాఫిక్​ వారు భావిస్తున్నారు. అందువల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్​ మళ్లింపులు ఉంటాయన్నారు. తెలంగాణ విమోచన వేడుకలు కారణంగా జరిగే బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలు రావడంతో ఎన్​టీఆర్​ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్‌ సెంట్రల్ జోన్‌, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్​ పోలీసులు తెలిపారు. ఇందిరాపార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని 9 జంక్షన్ లను ప్రయాణికులు రూట్ మార్చుకోవాలి.. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు..లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్ లలో ట్రాఫిక్ పూర్తిగా మల్లింపు ఉంటుందని వెల్లడించారు జాయింట్ సిపి రంగనాథ్. ఎన్టీఆర్ ఘాట్, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు ఉండడంతో ఆ ప్రాంతంలో వచ్చే వాహనాలకు అనుమతిలేదని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచించారు.