కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌ని కోరుకుంటున్నానుః గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

అణచివేత, ప్రజాస్వామ్య పోకడలను ప్రజలు సహించబోరన్న గవర్నర్

governor-tamilisai-speech-at-assembly

హైద‌రాబాద్ : ఈరోజు ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్ప‌డ్డ కొత్త ప్ర‌భుత్వానికి అభింద‌న‌లు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరాల‌ని కోరుతున్నా. ప్ర‌జాసేవ‌లో విజ‌యం సాధించాల‌ని కొత్త ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర్చే దిశ‌గా కృషి చేస్తాం. ప్ర‌జా ఫిర్యాదులు స్వీక‌రించేందుకు ప్ర‌జావాణి చేప‌ట్టాం. కొత్త ప్ర‌భుత్వం ప్ర‌యాణం ప్ర‌జాసేవ‌కు అంకితం కావాల‌ని కోరుకుంటున్నాను. రైతులు, యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ఈ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తుంది. ప్ర‌జ‌లంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాలి. ప్ర‌జా సంక్షేమం కోస‌మే ఆరు గ్యారెంటీలు ప్ర‌క‌టించాం. హామీల‌కు చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించే ద‌స్త్రంపై తొలి సంత‌కం చేశారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ప్ర‌తిమాట‌కు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు.

బాధ్య‌త‌లు స్వీక‌రించిన 48 గంట‌ల్లోనే రెండు గ్యారెంటీలు అమ‌లు చేశాం. వ‌చ్చే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమ‌లుకు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నాం. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్ర‌తి హామీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌జల ఆరోగ్య భ‌ద్ర‌త‌.. మా ప్ర‌భుత్వానికి అత్యంత ప్రాధాన్యం. రాజీవ్ ఆరోగ్య‌శ్రీని ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తీర్చిదిద్దాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిధిని రూ. 10 ల‌క్ష‌ల‌కు పెంచాం. ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ప్ర‌క‌టించిన అన్ని డిక్ల‌రేష‌న్లు అమ‌లు చేస్తాం. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం, గౌర‌వ‌భృతి ఇస్తాం. వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తాం. రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంది. అసైన్డ్, పోడు భూముల‌కు త్వ‌ర‌లోనే ప‌ట్టాల పంపిణీ చేప‌డుతాం అని గ‌వ‌ర్న‌ర్ తెలిపారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా యువ‌త‌కు మేం ఇచ్చిన ప్ర‌తి మాట‌ను నెర‌వేర్చుతాం అని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు. ఏడాది లోపు మా ప్ర‌భుత్వం 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తుంద‌ని, ఆరు నెల‌ల్లో మెగా డీఎస్సీ నిర్వ‌హించి, ఉపాధ్యాయ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పారు. రైతులు, పేద‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మ‌హిళ‌, యువ‌త‌, అమ‌ర‌వీరుల కుటుంబాలు, ఉద్య‌మ‌కారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు ఇలా ప్ర‌తీ వ‌ర్గాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచ‌ర‌ణ ఉంటుంది. యువ‌త జాబ్ క్యాలెండ‌ర్ విష‌యంలో చెప్పిన మాట ప్ర‌కారం కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేశారు. ప్రజలు తమ జీవితాల్లో మార్పు కోరుకున్నారని, ఇది సామాన్యుడి ప్రభుత్వమని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రంలో తమ పాలన దేశానికే ఆదర్శం కాబోతోందన్నారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తామన్నారు. రాష్ట్రం కోసం ప్రాగత్యాగం చేసిన వారికి సభావేదికగా నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.