ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఫ్యామిలీకి ప్రభుత్వ ఉద్యోగం

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను TSPSC రద్దు చేయడం తో మనస్థాపానికి గురై సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చిటికెన నవీన్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నవీన్ ఫ్యామిలీ ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇచ్చినట్లే ఇప్పుడు నవీన్ ఫ్యామిలీ కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నవీన్ రెండో సోదరుడికి జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్సీ బసవరాజుసారయ్య బాధిత కుటుంబానికి సంబంధించిన నియామక పత్రాన్ని అందజేశారు.

మరోపక్క ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా మరో వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గండీడ్‌కు చెందిన తిరుపతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఉపాధి హామీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న తిరుపతయ్య.. ఏఈ పేపర్‌ను డాక్యా నాయక్ నుంచి తిరుపతయ్య తీసుకుని రాజేంద్ర కుమార్‌కు అమ్మినట్లు దర్యాప్తు లో తేలింది.

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక సొంత మండలం గండీడ్ మండలం సల్కర్‌పేటకు చెందినవాడిగా తిరుపతయ్యను గుర్తించారు. తిరుపతయ్య నుంచి పేపర్ తీసుకున్న రాజేంద్ర కుమార్‌ను ఆదివారం అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా తిరుపతయ్యను అరెస్ట్ చేయడం జరిగింది.