రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్

దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్..రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతురాలైన బన్సూరీ స్వరాజ్.. వార్‌విక్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ సాహిత్యంలో డిగ్రీ చేశారు. అనంతరం.. లండన్ బీవీపీ లా స్కూల్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. ఆ తరువాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.

రియల్ ఎస్టేట్, ట్యాక్స్‌, అంతర్జాతీయ వాణిజ్య ఆర్బిట్రేషన్లు, క్రిమినల్ కేసులు వాదిస్తున్న బన్సూరీ ప్రస్తుతం హరియాణా రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ‘‘గతంలోనూ నేను పార్టీకి న్యాయపరంగా సహాయం చేశా.. ఇది కేవలం అధికారికంగా అవకాశం ఇవ్వడం లాంటిది.. పార్టీకి సేవ చేయడానికి అవకాశం వచ్చింది.. ఢిల్లీ బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ కో-కన్వీనర్గా క్రియాశీలంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, వీరేంద్ర సచ్దేవకు కృతజ్ఞతలు’’ అని బాన్సురీ స్వరాజ్ ట్వీట్ చేశారు.