ఒడిశాలో మరో రైలు ప్రమాద ఘటన..పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

goods-train-derails-in-odisha

బర్‌గఢ్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ ఘోర రైలు ప్రమాద ఘటన మరువక ముందే.. ఆ రాష్ట్రంలోనే మరో ప్రాంతంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బర్‌గఢ్‌ జిల్లాలో లైమ్‌స్టోన్‌ తీసుకెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. దీంతో ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. అప్ర‌మ‌త్త‌మైన రైల్వే అధికారులు ప‌లు రైళ్ల‌ను దారి మ‌ళ్లించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

కాగా, మూడు రోజుల క్రితం జ‌రిగిన కోర‌మండ‌ల్, బెంగ‌ళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. 900 మందికి పైగా క్ష‌త‌గాత్రులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ పట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు లైమ్ స్టోన్‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మొన్న జ‌రిగిన ప్ర‌మాదానికి 500 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని రైల్వే అధికారులు తెలిపారు.