రూ.500కే గ్యాస్ సిలిండర్.. తొలుత మొత్తం ధర చెల్లించాల్సిందే

తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..ఇప్పటీకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేయగా.. మరో రెండు గ్యారెంటీలు పట్టాలెక్కనున్నాయి. ఉచిత విద్యుత్ తో పాటు రూ. 500 గ్యాస్ స్కీమ్ పథకాలను ఈనెల 27 న సీఎం రేవంత్ రెడ్డి ప్రారభించబోతున్నారు.

ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సభ ఏర్పాటుకై స్థానిక నేతలు, అధికారులు ఫరా కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఈ నెల 27న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారభించబోతున్నారు. ఇక ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర (ప్రస్తుతం రూ.955) చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తిస్తుంది.