మహేష్ కు విలన్ గా అపరిచితుడు..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కు చియాన్ విక్రమ్ విలన్ గా మారబోతున్నాడా..అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

మాములుగా రాజ‌మౌళి సినిమాలో విల‌న్ పాత్ర హీరోకి ధీటుగా ఉంటుంది. ఢీ అంటే ఢీ అనేలా రాజమౌళి త‌న సినిమాలో విల‌న్ పాత్ర‌ల‌ను క్రియేట్ చేస్తార‌న‌డంలో సందేహ‌మే లేదు. ఇప్పుడు అలాంటి మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ విల‌నీ పాత్ర‌ను మ‌హేశ్ సినిమా కోసం ఆయ‌న డిజైన్ చేశార‌ట‌. ఈ పాత్ర‌లో కోలీవుడ్ విల‌క్ష‌ణ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ నటించే అవ‌కాశం ఉంద‌ని, ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌డానికి రెడీ అవుతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది చూడాలి.