ఐసీసీ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా సౌరవ్ గంగూలీ

మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్ గా నియామకం
ప్రకటించిన ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే

ముంబయి: బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీకి ప్రమోషన్ వచ్చింది. ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్ గా గంగూలీ నియమితులయ్యారు. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మరో భారత మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్థానంలో గంగూలీ నియామకమయ్యారు. ఇప్పటికే ఆ స్థానం నుంచి కుంబ్లే తప్పుకొన్నారు.

మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ గా గంగూలీకి స్వాగతమంటూ ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ క్లే అన్నారు. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అనుభవం ఐసీసీకి ఎంతో ఉపయుక్తమవుతుందని చెప్పారు. గత 9 ఏళ్లుగా ఎనలేని సేవలందించిన కుంబ్లేకి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్నేళ్లలో పకడ్బందీగా డీఆర్ఎస్ అమలు, అనుమానిత బౌలింగ్ యాక్షన్ ను గుర్తించేందుకు అధునాతన ప్రక్రియలకు అనిల్ కుంబ్లే శ్రీకారం చుట్టారని కొనియాడారు. అంతేగాకుండా మహిళా క్రికెట్ లోనూ ఫస్ట్ క్లాస్ స్టేటస్, లిస్ట్ ఏ క్లాసిఫికేషన్ కు ఐసీసీ ఆమోదం తెలిపింది. మహిళా క్రికెట్ కు సంబంధించి కూడా ఐసీసీ విమెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. ఆ కమిటీకి వెస్టిండీస్ క్రికెట్ సీఈవో జానీ గ్రేవ్ ను చైర్మన్ గా నియమించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/