బీజేపీలో విలీనమైన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేర్​పీపీ)ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. అలాగే తన పార్టీ నేతలతో తాను కూడా బిజెపి లో చేరబోతున్నట్లు ప్రకటించారు.

ఒకానొక సమయంలో బీజేపీకి బయట నుంచి మద్దతు ఇచ్చే ప్రశ్న తలెత్తిందని, కానీ తన పార్టీ కార్యకర్తలు విలీనానికి ఓటు వేశారని చెప్పారు. ఇక బీజేపీ తమ రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. మళ్లీ మోడీ ప్రధాని అయ్యేందుకు తాను మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. 2022లో జనార్దన్​ రెడ్డి స్థాపించిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్​పీపీ)ని బీజేపీలో విలీనం చేయడానికి, పార్టీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పార్టీ విలీన విషయమై జనార్దన్​ రెడ్డి ఇటీవల దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో చర్చలు జరిపారు. తాజాగా తన పార్టీ మద్దతుదారులతో, కేఆర్​పీపీ భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.