విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష : సుప్రీంకోర్టు
కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు తేల్చిన అత్యున్నత న్యాయస్థానం

న్యూఢిల్లీః లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధించినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. 2017 ఏప్రిల్ 18న మాల్యాను భారత్ కు అప్పగించేందుకు వారెంట్ జారీ కాగా, మాల్యా ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. 2016 నుంచి మాల్యా యూకేలో తలదాచుకుంటున్నారు. కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినందుకు మాల్యాకు నాలుగు నెలల జైలు, రూ.2,000 చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాల్యా ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం, అందుకు తగిన శిక్ష అవసరమని భావించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాల్యా తన కుటుంబ పిల్లలకు లోగడ 40 మిలియన్ డాలర్లు పంపించారు. వాటిని కోర్టుకు తిరిగి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నాలుగు వారాల్లోగా వడ్డీతో సహా నగదు డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు మాల్యాను ఆదేశించింది. డిపాజిట్ చేయకుంటే ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేశారు. మాల్యా ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకు రుణ ఎగవేత కేసులో నిందితుడిగా ఉన్నారు.
మాల్యా వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యే అవకాశాన్ని ఇచ్చినట్టు గుర్తు చేసింది. రూ.9,000 కోట్ల రుణాలు చెల్లించడంలో మాల్యా విఫలం కావడంతో ఎస్ బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. తన ఆస్తులను మాల్యా వెల్లడించలేదని, వాటిని తన పిల్లల పేరిట బదిలీ చేసుకుని నిబంధనలను తుంగలో తొక్కినట్టు విచారణలో గుర్తించారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/