కాంగ్రెస్ అధిష్టానం ఫై జంగా రాఘవ రెడ్డి ఫైర్

శుక్రవారం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితా ను విడుదల చేసింది. ముందుగా 55 మంది అభ్యర్థులను ప్రకటించగా..నిన్న 45 మంది తో కూడిన అభ్యర్థులను ప్రకటించింది. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇప్పటీకేపలువురు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపగా..తాజాగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్ తనకు కేటాయించకపోవటంతో కాంగ్రెస్ అధిష్ఠానం పై జంగా రాఘవ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను యుద్ధానికి ఆయుధంతో సిద్ధంగా ఉన్నానని, వరంగల్ పశ్చిమ ప్రజలు తనను గెలిపించటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

కొత్తగా వచ్చిన రేవూరికి, నాగరాజుకు, యశస్వినికి టికెట్లు ఇచ్చారని, నాకు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. తాను పార్టీ మీటింగ్స్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, అయినా పార్టీ తనను గుర్తించలేదని అన్నారు. తనపై కుట్ర జరిగిందని, అందుకే తనకు టికెట్ కేటాయించలేదని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. నాయిని రాజేందర్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక అసమర్ధుడని మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ భూములు అమ్ముకున్న నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. అసలు ఏ సర్వే ప్రకారం నాయినికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా అందుకు తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక జరగలేదన్నారు.