హైదరాబాద్ లో ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్

హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ముగిసింది. మూడు రోజుల పాటు నెక్లెస్ రోడ్డులో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ లో ‘గాడ్ స్పీడ్ కొచ్చి’ టీమ్ 417.5 పాయింట్లతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 385 పాయింట్లతో బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ టీమ్ రెండో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో గోవా (282 పాయింట్లు), నాలుగో స్థానంలో చెన్నై (279 పాయింట్లు), ఐదో స్థానంలో బెంగళూరు (147.5 పాయింట్లు), ఆరో స్థానంలో ఢిల్లీ (141 పాయింట్లు) జట్లు నిలిచాయి. ఈసారి రేసింగ్ లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ పోటీలో 250 నుంచి 300 కిలోమీటర్ల స్పీడ్ తో స్పోర్ట్స్ కార్లు దూసుకుపోయాయి.

ఇక ఈ రేసింగ్ పోటీలకు సన్నాహకంగా గత నెల 19, 20వ తేదీల్లో ఇండియన్ రేసింగ్ తలపెట్టారు. అయితే, రేసింగ్ కొనసాగుతుండగా.. ట్రాక్‌పై చెట్టు కొమ్మ విరిగిపడటం, మలుపుల వద్ద లోపాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రేసింగ్ ఈవెంట్‌ను అర్ధంతరంగా మధ్యలోనే వాయిదా వేశారు. అప్పుడు ఈ షోకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వెనక్కి ఇచ్చింది ఇండియన్ రేస్ లీగ్. అనంతరం దిద్దుబాటు చర్యలు చేపట్టి తిరిగి ‘ఇండియన్ రేసింగ్’ నిర్వహించారు.