మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Congress

హైదరాబాద్‌ః తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే మరో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి భువనగిరి టికెట్ కేటాయించగా, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిజామాబాద్ టికెట్ కేటాయించింది. ఆదిలాబాద్ (ఎస్టీ) స్థానాన్ని ఆత్రం సుగుణ, మెదక్ స్థానాన్ని నీలం మధుకు కేటాయిస్తూ గత రాత్రి జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. పోటీ తీవ్రంగా ఉన్న ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ స్థానాలను పెండింగులో ఉంచింది. వీటికి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఈ నెల 31న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.

బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీఈసీ సమావేశమైంది. అనంతరం దేశవ్యాప్తంగా 14 స్థానాలతో 8వ జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణ‌లోని నాలుగు స్థానాలతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్‌ స్థానాలు కూడా ఉన్నాయి. కాగా, భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనను కోరినా అంగీకరించలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన చూసి కేటీఆర్ వణుకుతున్నారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తాను నేరం చేయలేదని ఒక్కసారి కూడా చెప్పలేదని అన్నారు.