ఫిబ్రవరి 27 నుంచి ఫ్రీ కరెంట్, రూ.500కే సిలిండర్ – భట్టి

తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలను త్వరలోనే అందిస్తామన్నారు. గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రూ.500కే సిలిండర్ పథకానికి రూ.80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లిస్తే రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇప్పటివరకు సుమారు 40 లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ లబ్ది జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే.. రెండు గ్యారంటీలు ప్రారంభించింది. మొత్తం 6 గ్యారంటీలలో.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు గ్యారంటీలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది.