వారాహిని లారీతో పోల్చిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఘాటైన విమర్శలు చేసారు. 2022 -23 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగన్ 42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేశారు.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్‌ ఇప్పుడు ఓ లారీ ఎక్కాడు. వారాహి అనే లారీ ఎక్కి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడని మండిపడ్డారు. దత్తపుత్రుడిలా మనం బూతులు తిట్టలేం.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేమని చెప్పుకొచ్చారు. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకురాలేం. ఇవన్నీ దత్తపుత్రుడికే పేటెంట్ అని విమర్శించారు. టీడీపీ అంటే తినుకో.. దోచుకో .. పంచుకో అని పేరు అన్నారు.

చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు అని గాంధీ గారి మూడు కోతులు చెబుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం మంచి వినవద్దు, మంచి కనవద్దు, మంచి అనవద్దు, మంచి చేయవద్దు అనే నాలుగు కోతులు ఉన్నాయని జగన్ అన్నారు. ఆ దుష్ట చతుష్టయం గురించి ప్రజలకు తెలుసన్న జగన్.. ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచడమే వారికి తెలిసిన ఏకైక నీతి అని ఘాటైన వ్యాఖ్యలు చేసారు. మరి జగన్ కామెంట్స్ ఫై జనసేన , టీడీపీ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.