యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

ఇంట్లో నుండి అడుగు బయటపెట్టాలంటే భయం వేస్తుంది. మృతువు ఏ రూపంలో వస్తుందని..ముఖ్యంగా హైవే రోడ్ల ప్రయాణం అంటే చావుతో చెలగాటమే..మనం నిదానంగా వెళ్లిన అవతలి వాహనం ఎంత స్పీడ్ గా వస్తుందో..ఏ నుండి ఢీ కొడుతుందో అర్ధం కానీ పరిస్థితి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి రోజు పెను ప్రమాదాలు జరుగుతూ..మనుషుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. రోడ్ అద్భుతంగా ఉండడం తో వాహనదారులు జెట్ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇందులో కొంతమంది నిద్ర మబ్బులో , మరికొంత మంది తాగి డ్రైవ్ చేసి ప్రమాదాలు చేస్తున్నారు.

తాజాగా చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మల్కాపురం గ్రామం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ప్రైవేట్ బస్సు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొట్టడం తో నలుగురు మహిళలు మృతి చెందగా..12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం రోజూవారిలాగానే 16 మంది మహిళలు ఆటోలో వెళ్తుండగా..మల్కాపురం గ్రామం వద్ద ప్రైవేట్ బస్సు స్పీడ్ గా వచ్చి ఆటో ను ఢీ కొట్టింది. దీంతో ఆటో లో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబసభ్యులకు అందించారు. కూలీలందరూ దేవాలమ్మ నాగారం గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.