ఉత్తరాంధ్రకు వైఎస్‌ఆర్‌సిపి ఏం చేసిందో చెప్పాలిః గంటా శ్రీనివాసరావు

former-minister-ganta-srinivas-rao-challenge-to-cm-jagan

అమరావతిః మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సిఎం జగన్‌కు సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్‌సిపి హయాంలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు వైఎస్‌ఆర్‌సిపి ఏం చేసిందో చెప్పాలన్నారు. రుషికొండకు బోడిగుండు తప్ప.. ఉత్తరాంధ్రకు ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగేళ్ళ కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చకు రావాలని సీఎంకు సవాల్ విసిరారు. డిఫెన్స్ ఎయిర్ పోర్ట్, సాధారణ ఎయిర్ పోర్ట్‌కు మధ్య తేడా జగన్‌కు తెలియదన్నారు. జీఎంఆర్ చంద్రబాబుకు బినామీ అని విమర్శలు చేశారు.. మర్చిపోయారా అని అన్నారు. శంకుస్థాపన చేసిన వాటికే నిన్న సీఎం శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. అదాని డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్ టిడిపి హయాంలో శంకుస్థాపన చేసినవే అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్‌పై చేసిన కామెంట్స్‌ను గంటా శ్రీనివాసరావు మీడియా ముందు వినిపించారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు 2,700 ఎకరాలు ఉండాలని చంద్రబాబు భూ సేకరణ చేశారని.. ఇప్పుడు 500 ఎకరాలు తీసేసి జగన్ శంకుస్థాపన చేశారన్నారు. అధాని డేటా సెంటర్‌పై జగన్ మీడియా గతంలో ఏం రాసిందో మీడియా ముందు ప్రదర్శించారు. జగన్ కే కాదు, ఆయన క్యాబినెట్ మంత్రులకు అవగాహన లేదన్నారు. ఆదిరెడ్డి కుటుంబాన్ని కావాలనే వేధిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మార్గదర్శి, ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన చిట్ ఫండ్‌లే ఉన్నాయా? మిగిలిన వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. టిడిపి నేతలపై జగన్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందని.. సిట్ వేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సిపికి మీకు కౌంట్ డౌన్ ప్రారంభం అయిందన్నారు. రజనీకాంత్‌పై పిచ్చి కుక్కలు మాట్లాడుతున్నాయని.. జగన్ కంట్రోల్ చేయాలని హితవుపలికారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా.. వాటిమూలాలు ఏపీలో దొరుకుతున్నాయన్నారు. ప్రజావేదిక కూల్చి తన పాలన ఎలా ఉంటుందో జగన్ ముందే చెప్పారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.