రెజ్లర్ల పట్ల పోలీసుల తీరుపై స్పందించిన సిఎం కేజ్రీవాల్‌

బిజెపిని తరిమికొట్టే సమయం వచ్చింది.. అరవింద్‌ కేజ్రీవాల్‌

‘Time To Drive Them Out’: CM Kejriwal Attacks BJP After

న్యూఢిల్లీః రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. దేశంలోని చాంపియన్‌ ప్లేయర్ల పట్ల ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. బిజెపి ని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది అని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘దేశంలోని చాంపియన్ ప్లేయర్లతో ఇలా దుర్మార్గంగా ప్రవర్తించడం విచారకరం, సిగ్గుచేటు. ఈ వ్యక్తులు (బిజెపి) మొత్తం వ్యవస్థను గుండాయిజంతో నడపాలని కోరుకుంటున్నారు. మొత్తం వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు. ఇకపై దేశంలోని ప్రజలు బిజెపి గూండాయిజాన్ని సహించొద్దు.. బిజెపిని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.

లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్ భూష‌ణ్‌ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ లోని జంత‌ర్ మంత‌ర్‌ వద్ద గత కొన్ని రోజులుగా రెజ్లర్లు చేపడుతున్న ధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధరవారం అర్ధరాత్రి రెజ్లర్లు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిరసన తెలుపుతున్న రెజ్లర్ల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి బుధవారం రాత్రి మడత మంచాలు తీసుకొచ్చారు. అయితే వారికి వాటిని ఇచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. అనప్పటికీ వారు ట్రక్కు నుంచి మంచాలు, పరుపులను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రెజ్లర్లు, ఎమ్మెల్యే అనుచరులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెజ్లర్లు బజరంగ్‌ పునియా , వినేశ్‌ ఫొగట్ తోపాటు పలువురికి తలపై గాయాలయ్యాయి.