జనవరి 31 నుంచి పార్లమెంట్​ బడ్జెట్‌ సమావేశాలు

జనవరి 31 నుంచి పార్లమెంట్​ బడ్జెట్‌ సమావేశాలు జరగబోతున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు.ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల పూర్తి అజెండా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీకి చేరినట్లు తెలుస్తున్నది.

బడ్జెట్‌ సమావేశాలు రెండు విడతలుగా (జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు) జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు, రెండో విడతలో మార్చి 6న తిరిగి ప్రారంభమై ఏప్రిల్‌ 6న ముగియనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల తొలి రోజునే ఆర్థిక సర్వే నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెడతారని అధికారులు తెలిపారు.

బడ్జెట్‌ సమావేశాల తొలి విడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చేసే తీర్మానంపై చర్చించనున్నారు. అలాగే, కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారని వెల్లడించారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లో వివిధ మంత్రిత్వ శాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తెలపడం వంటివి చేపట్టనున్నారు.