ఎంపీ అర్వింద్ పై దాడిని ఖండించిన బిజెపి నేతలు

జ‌గిత్యాల జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం ఎర్డండి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కారుపై రాళ్ల దాడి జరగడం..ఆయన్ను పర్యటించకుండా అడ్డుకోవడం ఫై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎర్దండి గ్రామ స‌మీపంలో గోదావ‌రి న‌ది ప్ర‌మాద‌క‌ర‌స్థాయిలో ప్ర‌వ‌హిస్తోంది. దీంతో ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించేందుకు అర‌వింద్ ఈరోజు ఉద‌యం వెళ్లారు. ఈ క్రమంలో కొంతమంది నిరసన కారులు ఆయన్ను అడ్డుకొని , ఆయన కారును ధ్వసం చేసారు. ఈ ఘటన పట్ల బిజెపి నేతలు స్పందించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నియంతృత్వ వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేకే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటని, ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

హుజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సైతం దీనిని ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్ల చేస్తున్న చర్యలని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటె ఈ ఘటన తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..అరవింద్ కు ఫోన్ చేశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షా‌కు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పినట్లు తెలుస్తుంది.