పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పటిష్ఠపరచడంతో పాటు ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను మరో మీటరు మేర ఎత్తు పెంచేందుకు పనులు చేపట్టారు. మీటరు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పున మట్టిని, ఇసుక బస్తాలను వేసి గట్టిపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌ 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మీటరు మేర ఎత్తు, రెండు మీటర్ల వెడల్పున మట్టి, ఇసుకతో పటిష్ఠ పరచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎగువ కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే వద్ద 20.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపటికి 28 లక్షల క్యూసెక్కుల వరకూ వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ జలవనరుల శాఖ ఈ పనులు చేపట్టింది.

మరోపక్క గోదావరి వరదలు..సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నాం ఏరియల్‌సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియమించారు. రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను జగన్‌ ఆదేశించారు. ముంపు గ్రామాలు, వరద బాధితులకోసం ఏర్పాటు చేసిన శిబిరాలు, అందుతున్న సౌకర్యాలు, నిత్యావసరాల సరఫరా, అత్యవసర సేవలు, వైద్య సేవలు, మందులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సీనియర్‌ అధికారులతోనూ చర్చించిన సీఎం జగన్‌.. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక్కో సీనియర్‌ అధికారిని నియమించాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కార్తికేయ మిశ్రా, తూర్పుగోదావరి జిల్లాకు అరుణ్‌కుమార్, డా. బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు ప్రవీణ్‌కుమార్, ఏలూరు జిల్లాకు కాటమనేని భాస్కర్‌లను నియమించారు.