కెమెరాకు చిక్కిన ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులు ..కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!
8 రోజులుగా టన్నెల్‌లోనే 41 మంది కార్మికులు

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్, ఉత్తరకాశీలోని కుంగిపోయిన సిల్క్‌యారా టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికుల ఫొటోలు తొలిసారి బయటకు వచ్చాయి. ఈ ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎనిమిది రోజుల క్రితం 41 మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ఆరు అడుగుల వెడల్పాటి పైపులైన్ ద్వారా వారికి ఆహారం అందించారు. చిక్కుకుపోయిన కార్మికులు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు టన్నెల్‌లోకి ఓ కెమెరాను పంపిన అధికారులు దాని ద్వారా వీడియో తీశారు. కార్మికులందరూ క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, సోమవారం రాత్రి కార్మికులకు పైపు ద్వారా గ్లాస్ సీసాల్లో కిచిడీ పంపించారు. అంతకుముందు డ్రైఫ్రూట్స్ మాత్రమే అందించారు. ఈ ఉదయం వారికోసం వేడివేడి అల్పాహారం కూడా సిద్ధం చేశారు. త్వరలో వారికి మొబైల్ ఫోన్లు, చార్జర్లను కూడా పంపిస్తామని రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌చార్జి కల్నర్ దీపక్ పాటిల్ చెప్పారు.
మరోవైపు టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద డ్రిల్లింగ్ యంత్రాలు సొరంగం వద్దకు చేరకున్నాయి. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం కూడా ఘటనా స్థలంలో ఉన్నది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.