పదేళ్ల బిజెపి పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదుః హరీశ్ రావు

harish-rao-fires-at-raghunandan-rao

హైదరాబాద్‌: మెదక్ లోక్ సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా పని చేస్తే దుబ్బాకలో ఎందుకు గెలవలేదు? అని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు రఘునందన్ రావును ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. పదేళ్ల బిజెపి పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. మెదక్ లోక్ సభ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. భవిష్యత్తు అంతా బిఅర్ఎస్‌దేనని… మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డిని గెలిపించాలన్నారు.

వెంకట్రామిరెడ్డి అధికారిగా మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేశారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని విమర్శించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శాసన సభ సాక్షిగా అబద్దాలు చెప్పారని విమర్శించారు. ఎన్నో హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారన్నారు. అభయహస్తం, కెసిఆర్ కిట్, వరికి బోనస్ ఎక్కడ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 200 మందికి పైగా రైతులు చనిపోయారన్నారు.