తిరుమలలో మరో తప్పిదం : ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ మధ్య వరుస వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న సర్వదర్శనం టికెట్స్ విషయంలో జరిగిన తప్పిదం విమర్శల పాలు చేయగా..తాజాగా ఇప్పుడు ఎల్ఈడీ స్క్రీన్లపై తెలుగు సినిమా పాటల ప్రసారం కావడం భక్తులను షాక్ కు గురిచేసింది.

తిరుమలలోని ఓ వ్యాపార సముదాయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. నిత్యం గోవింద నామస్మరణ, అన్నమయ్య తదితరుల భక్తిగీతాలతో మార్మోగే తిరుమల కొండపై సినిమా పాటలు ప్రసారం కావడంతో భక్తులు విస్తుపోయారు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు సినిమా పాటలు ప్రసారం అయ్యాయి. సినిమా పాటల దృశ్యాల వెనుక గోవింద నామాలు ప్రసారం కావడంతో భక్తులు విస్మయానికి గురయ్యారు. మరి ఈ ఘటన పట్ల టీటీడీ ఏ సమాధానం చెపుతుందో చూడాలి.