రేపు వరుణ్ – లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం

గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వరుణ్ తేజ్ – లావణ్య ప్రేమ వ్యవహారం గురించి రకరకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుండి మెగా అప్డేట్ వచ్చింది. రేపు (జూన్ 9) ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ – లావణ్య ల ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.

అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ రవణం స్వామినాయుడు ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ఎన్నాళ్లుగానో వేచిన తరుణం వచ్చేసిందంటూ వరుణ్ తేజ్, లావణ్యలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘మిస్టర్’లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి జంటగా నటించారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. వరుణ్ తేజ్ సోదరి నిహారికా కొణిదెల‌ వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్నారు. రీతూ వర్మతో కలిసి వెళ్లారు. నిహారికకు వాళ్ళిద్దరు స్నేహితులే. అయితే… వరుణ్ తేజ్ ప్రేమ విషయం కూడా ఆ పెళ్ళిలో బయట పడింది. మెగా ఫ్యామిలీకి చెల్లెలి పెళ్ళిలో తన ప్రేమ సంగతి చెప్పారట.

ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాంఢీవదారి అర్జున’ సెట్స్ మీద ఉంది. ఆ సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశాలు వెళ్లి వచ్చారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. పెళ్లి సమయానికి షూటింగులు ఏవీ లేకుండా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.