నిర్లక్ష్యం చేస్తే రోజుకి లక్ష కేసులు నమోదవ్వొచ్చు

అమెరికాకు ఫౌచీ హెచ్చరిక

Fauci Warns US Coronavirus Cases Could Rise to 100,000 a Day

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఈనేపథ్యంలోనే ఆ దేశ ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రానున్న రోజుల్లో రోజుకు లక్ష కొత్త కేసులు నమోదయ్యే ప్ర‌మాదం ఉంద‌ని చెప్పారు. అమెరికాలో క‌రోనా వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపై అసంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న అత్య‌‌వ‌స‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. క‌రోనా వైర‌స్ ప్రమాదకరమైన పెరుగుదలను నివారించడం కోసం తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంద‌న్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు ప్ర‌జ‌లు, అధికారులు ఎవ‌రికి వారే జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోకపోతే ప్రస్తుతం రోజుకు 40 వేల చొప్పున న‌మోద‌వుతున్న కేసులు ఇక‌పై ల‌క్ష‌ల‌కు చేరినా ఆశ్చ‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫౌచీ వ్యాఖ్యానించారు.

కొత్త కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో మ‌హ‌మ్మారి నిర్మూల‌న‌కు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవసరం ఉందని ఫౌచీ నొక్కి చెప్పారు. క‌రోనా క‌ట్టిడిలో వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా ఎవ‌రికివారే బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప స‌మ‌స్య ప‌రిష్కారం ఉండ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ముఖ్యంగా ఇండ్ల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు మాస్క్ లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించ‌క‌పోవ‌డం వంటివి చేస్తే చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అమెరికా ప్ర‌జ‌ల‌ను ఫౌచీ హెచ్చ‌రించారు. కాగా అమెరికాలో 26.28 ల‌క్ష‌లకుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 1.27 ల‌క్ష‌ల మందికిపైగా అమెరిక‌న్లు క‌రోనా బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/