మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35%కోటా

Eye on Madhya Pradesh polls, Chouhan notifies 35% quota for women in govt jobs

భోపాల్‌ః అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాన్ని నిలబెట్టుకోవాలని బిజెపి తాపత్రయపడుతోంది. ఇందుకోసం పటిష్ఠ ప్రణాళికలు చేపడుతోంది. ఇప్పటికే తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు మధ్యప్రదేశ్​లో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

శాసనసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం కోటా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ కోటా నుంచి అటవీ శాఖను మినహాయించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ సివిల్‌సర్వీసెస్‌ రూల్స్‌ను సవరించింది. పోలీసు శాఖతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు….సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టుల్లో 50శాతం మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు. లాడ్లీ బహన యోజన పేరుతో మహిళలకు నెలకు 1250 రూపాయలు చెల్లించనున్నట్లు సీఎం చౌహాన్‌ ప్రకటించారు.