బెంగాల్‌ మంత్రి ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు

Probe agency ED raids Bengal Food Minister in civic body recruitment scam

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేబినెట్‌లోని మరో మంత్రి ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి ఆహార శాఖ మంత్రి రతిన్ ఘోష్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా కోల్‌కతాలోని మంత్రి ఇంటితోపాటు 13 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నది. గతంలో రతిన్‌ ఘోష్‌.. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో పురపాలికలో పెద్దసంఖ్యలో అనర్హులకు ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికోసం ఘోష్‌తోపాటు అతని సహచరులు అభ్యర్థుల నుంచి లంచం తీసుకున్నారనే అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఘోష్‌ నివాసంతోపాటు 13 నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారులు చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే కేసులో ఆయన భార్య రుజిరాకు కూడా నోటీసులు పంపింది. ఆమెను ఈ నెల 11న విచారణకు రావాలని కోరింది. ఎంపీ అభిషేక్‌కు ఈ నెల 3నే ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన హాజరుకాని విషయం తెలిసిందే.