రేషన్ కార్డుల e-KYC గడువు పొడిగింపు

తెలంగాణ లో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. e-KYC గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 31తో గడువు ముగియనుండగా రేషన్ షాపుల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం లేకపోలేదు. ఇలా మరోసారి గడువుపెంచడంతో మరో నెలరోజుల పాటు అవకాశం వచ్చింది..

వాస్తవానికి 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు.. అంటే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోరు. మరికొందరు కొత్తగా పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొందరు పెండ్లి తర్వాత వేరుగా ఉంటున్నారు. అయినా.. రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇలా రేషన్‌ బియ్యం పక్కదారిపట్టకుండా.. బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్‌ కస్టమర్‌’ (KYC)పేరుతో రేషన్‌ కార్డుల వేరిఫికేషన్‌ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు.