నేడు నితీశ్ ప్రమాణ స్వీకారం

నేడు తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం గవర్నర్ ను కలసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. తిరిగి సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

9వసారి సీఎంగా నితీష్ బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఆయన కాంగ్రెస్ శిబిరం నుంచి బీజేపీకి మారనున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం, ఒక స్పీకర్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా నేడు పట్నాకు చేరుకోనున్నారు.

గత 20 ఏళ్లలో ఇప్పటికే 8 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. దేశ రాజకీయాల్లో ఇదో రికార్డు. 2022లో NDAతో తెగదెంపులు చేసుకున్నారు నితీశ్. ఉన్నట్టుండి బయటకు వచ్చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్, RJD మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 8వ సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడే కాదు. 2005 నుంచి ఈ సీఎం రేసులో ఉన్నారు నితీశ్ కుమార్. 2014-15 లో మాత్రం జితన్ రామ్ మాంజి నితీశ్‌కి గట్టి పోటీ ఇచ్చి ఆ పదవిని సొంతం చేసుకున్నారు.

నిజానికి 2000 సంవత్సరంలోనే తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నితీశ్ కుమార్. కానీ ఆయన ప్రభుత్వం వారం రోజులు కూడా నిలబడలేదు. బలపరీక్షలో ఓడిపోవడం వల్ల ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా మళ్లీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తరవాత ఐదేళ్లకు అంటే 2005లో జేడీయూ, బీజేపీ పొత్తు పెట్టుకోడం వల్ల మెజార్టీ సీట్లు సాధించారు. JDU 88 సీట్లు సాధించింది. బీజేపీ 55 చోట్ల గెలిచింది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడే ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు నితీశ్. ఈ సారి ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరవాత 2010లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు. కాకపోతే 2014లో ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి దిగిపోయారు.

2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో JDU,RJD, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి నితీశ్ కుమార్‌నే వరించింది. అయితే..ఈ మహాఘట్‌బంధన్‌లో కొన్ని విభేదాలు తలెత్తాయి. సైద్ధాంతికంగా ఒక పార్టీ మరో పార్టీతో విభేదించింది. ఫలితంగా…2017 జులైలో మహాఘట్‌బంధన్‌ నుంచి తప్పుకున్నారు. వెంటనే బీజేపీ మద్దతుతో మరోసారి అధికారంలోకి వచ్చారు. అప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరవాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి 2022లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. NDA నుంచి బయటకు వచ్చేశారు. బీజేపీతో సరిపడడం లేదంటూ తేల్చి చెప్పారు. RJD,కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ కూటమికీ గుడ్‌బై చెప్పేసారు.