కుల గ‌ణ‌న..రాహుల్ వ్యాఖ్య‌ల‌కు అఖిలేశ్ కౌంట‌ర్

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఎందుకు కుల గ‌ణ‌న చేప‌ట్ట‌లేదు..

Akhilesh Yadav jabs Rahul Gandhi for calling caste census an ‘X-ray’

న్యూఢిల్లీః ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మిలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కుల గ‌ణ‌న గురించి కాంగ్రెస్, స‌మాజ్‌వాదీ పార్టీలు వైరుధ్య అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తున్నాయి. అధికారంలో ఉన్న స‌మ‌యంలో.. కాంగ్రెస్ పార్టీ కుల గ‌ణ‌న చేప‌ట్ట‌లేద‌ని ఎస్పీ నేత అఖిలేశ్ యాద‌వ్ ఆరోపించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాత్నాలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వాలు త‌ప్పుడు విధానాల‌తో ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయింద‌న్నారు. కుల గ‌ణ‌న గురించి రాహుల్ గాంధీ కామెంట్ చేసిన నేప‌థ్యంలో అఖిలేశ్ విమ‌ర్శించారు. కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని, అది ఎక్స్ రే లాంటిద‌ని, దాని వ‌ల్ల విభిన్న వ‌ర్గాల స‌మాచారం తెలుస్తుంద‌ని రాహుల్ ఓ స‌భ‌లో మాట్లాడుతూ తెలిపారు. కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేయ‌డం ఇదో మిరాకిల్ అన్నారు.

రాహుల్ వ్యాఖ్య‌ల‌కు అఖిలేశ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఎక్స్ రే అవ‌స‌రం అని, ఇప్పుడు ఎంఆర్ఐ, సీటీ స్కాన్లు అందుబాటులో ఉన్నాయ‌ని, ఆ వ్యాధి ఇప్పుడు వ్యాపించింద‌ని, అప్పుడే ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే, ఇప్పుడు ఈ స‌మ‌స్య ఉండేది కాద‌న్నాడు. కుల గ‌ణ‌న చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేయ‌డం వింత అని, ఎక్స్ రే గురించి మాట్లాడే వ్య‌క్తులు స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత కుల గ‌ణ‌న చేప‌ట్ట లేద‌న్నారు. కుల గ‌ణ‌న చేయాల‌ని ములాయం, శ‌ర‌ద్ యాద‌వ్‌, లాలూ ప్ర‌సాద్ లోక్‌స‌భ‌లో డిమాండ్ చేసినా.. కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్య‌తిరేకించిన‌ట్లు అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు.