ఎర్రకోటలో మోడీకి ఇదే చివరి ప్రసంగం : మల్లికార్జున ఖర్గే జోస్యం

సమయాభావం వల్లే ఎర్రకోటలో జరిగిన వేడుకలకు హాజరు కాలేదని వివరణ

Explanation that he could not attend the ceremonies at the Red Fort due to lack of time

న్యూఢిల్లీః ఎర్రకోట వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం నిండా అతిశయోక్తులు, అబద్ధాలే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. వచ్చే ఏడాది కూడా ఇదే వేదికపై తాను జెండా ఎగరవేస్తానని చెప్పడం మోడీ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ప్రధానిగా మోడీకి ఇదే చివరి ఏడాది అని, వచ్చే సంవత్సరం ఆయన తన ఇంటి వద్దే జెండా ఎగరవేస్తారని ఖర్గే జోస్యం చెప్పారు. ఎర్రకోటపై జెండా ఎగరవేసే అవకాశం ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం ప్రజల చేతుల్లో ఉందని తెలిపారు. ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు హాజరుకాకపోవడానికి కారణం చెబుతూ ఖర్గే మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని తప్ప మిగతా వారిని ముందుకు వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని ఖర్గే చెప్పారు. దీంతో సమయానికి వేదిక వద్దకు చేరుకునే అవకాశంలేదని, అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని భావించినట్లు తెలిపారు. దీంతో తన నివాసంలో, ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశానని ఖర్గే వివరించారు. అంతకుముందు, స్వాతంత్ర్య వేడుకలకు ఖర్గే హాజరుకాకపోవడాన్ని బిజెపి తప్పుబట్టింది. ఎర్రకోట వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలలో ఖర్గేకు కేటాయించిన కుర్చీ ఖాళీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందిస్తూ.. ఖర్గే వీడియో సందేశం విడుదల చేశారు.