తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో భారీ వర్షం కురిసింది. గత కొద్దీ రోజులుగా విపరీతమైన ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా.. ఆలయం చుట్టు పక్కల రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరోవైపు మూడు కిలోమీటర్ల మేర భక్తుల క్యూ ఉండగా.. క్యూ లైన్‌లోకి నీరు చేరడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు వర్షం కారణంగా తీవ్రవస్థలు పడ్డారు.

అప్పటి వరకు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయిన భక్తులు సేదతీరారు. దాదాపు 30 నిమిషాలపాటు పడిన వర్షంతో.. తిరుమల కొండలపై చల్లని గాలులు వీచాయి. తడిస్తే తడిశాం.. ఎండ నుంచి రిలాక్స్ అయ్యాం అంటూ కొంత మంది భక్తులు వర్షంలో తడుస్తూనే నడుచుకుంటూ గదులకు వెళ్లారు. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీలపైనే ఎండ తీవ్రత ఉంటుంది. భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.