ప్రశాంతంగా కొనసాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్‌ సెంటర్లకు బారులు తీరారు. పనులకు వెళ్లే వారు ఉదయమే వచ్చి ఓటేసి వెళుతున్నారు. తొలి గంటలోనే గ్రామాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ సజావుగా జరిగేలా పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. మొత్తం 298 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాల నిఘాలో ఉప పోలింగ్‌ జరుగుతోంది.

హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో కసితో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌.. మునుగోడులో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి.. సత్తాను చాటేందుకు శాయశక్తులా పనిచేస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ తన శక్తినంతా ధారబోస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తెగా రంగంలోకి దిగిన పాల్వాయి స్రవంతి గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గంలో 298 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.