ప్రమాదం నుండి బయటపడ్డ కడెం ప్రాజెక్ట్

కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుండి బయటపడడం అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం తో అన్ని ప్రాజెక్ట్ లకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడెం ప్రాజెక్ట్ మధ్యాహ్నం వరకు ప్రమాదం లో స్థాయిలో ఉంది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వస్తుండడంతో అధికారులు మొత్తం 18 గేట్లను ఎత్తాలని అనుకున్నారు. కానీ వాటిలో నాల్గు గేట్లు మొరాయించడం తో 14 గేట్ల ద్వారా నీటిని కిందకు వదిలారు.

14 గేట్లను ద్వారా దాదాపు 2.19 లక్షల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్టు నిండుకోవడం..ప్రాజెక్ట్ సామర్ధ్యానికి మించి వరద వస్తుండం తో దిగువ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను తరలించి ఇళ్లను ఖాళీ చేయించడం జరిగింది. ఆ తర్వాత మొరాయించిన నాల్గు గేట్లలో ఒక గేటును స్థానికులు , యువత ఓపెన్ చేయడం తో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయ్యింది. ప్రస్తుతమైతే కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుండి బయట పడినట్లు తెలుస్తుంది.

ఉదయం కడెం ప్రాజెక్టును పరిశీలించేందుకు ఎమ్మెల్యే రేఖా నాయక్ తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లారు. వారితోపాటు ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అయితే, ప్రాజెక్టు పరిస్థితి చూసి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించడంతో వారు వెనుతిరిగారు. ఏ క్షణంలో ఏంజరుగుతుందో తెలియని పరిస్థితిని చూసి ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు. వరద తగ్గితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లించుకుంటానని మంత్రి ఇంద్రకరణ్ తెలిపారు.

మరోపక్క నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం తో కాసేపట్లో ప్రాజెక్ట్ గేట్లను ఎత్తనున్నారు. ఎగువ ప్రాంతం నుంచి 26,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1403 అడుగుల వరకు నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.568 టీఎంసీ నీరు నిలువ ఉందని వివరించారు. అలాగే గడ్డెన్నవాగు ప్రాజెక్టు నిండడంతో అధికారులు ఆరుగేట్లను ఎత్తిదిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నుంచి దాదాపులక్షకుపైగా క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉన్నది. అయితే, ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భైంసాలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.