సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత జవాన్లపై బంగ్లాదేశీల దాడి

వందమందికి పైగా మూకుమ్మడిగా దాడిచేసిన బంగ్లా వాసులు

2 BSF jawans injured in attack by Bangladeshi villagers along international border in West Bengal

కోల్‌కతాః సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న భారత జవాన్లపై బంగ్లాదేశ్ గ్రామస్థులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షీదాబాద్ జిల్లా బెర్హంపూర్ సెక్టార్ లో ఆదివారం ఈ దాడి జరిగింది. దీంతో ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయని ఆర్మీ తెలిపింది. గాయపడ్డ జవాన్లను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. బెర్హంపూర్ సెక్టార్ పరిధిలోని నిర్మల్చర్ ఔట్ పోస్ట్ వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ పీ) జవాన్లు గస్తీ కాస్తున్నారు. ఆదివారం సరిహద్దులకు ఆవలి వైపు నుంచి కొంతమంది గ్రామస్థులు తమ పశువులను మేపేందుకు బార్డర్ దాటే ప్రయత్నం చేశారు.

అక్కడే ఉన్న జవాన్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్థులంతా కలిసి సైనికులపై దాడి చేశారు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న మరికొంతమంది గ్రామస్థులు కూడా దాడిలో పాల్గొన్నారు. సుమారు వంద మంది దాకా గ్రామస్థులు పదునైన ఆయుధాలు, కట్టెలతో దాడి చేయడంతో జవాన్లు ఇద్దరు గాయపడ్డారు. ఆపై సైనికుల దగ్గరున్న ఆయుధాలను గ్రామస్థులు ఎత్తుకెళ్లారు. అనంతరం అక్కడికి చేరుకున్న తోటి సైనికులు గ్రామస్థుల దాడిలో గాయపడ్డ జవాన్లను ఆసుపత్రికి తరలించారు.