చంద్రబాబుపై కేసులకు సంబంధించిన ఆధారాలు ప్రజల ముందు పెట్టాలిః లోకేశ్ డిమాండ్‌

చంద్రబాబును జైలులోనే చంపేస్తామంటున్నారని విమర్శ

Evidence related to cases against Chandrababu should be put before people: Lokesh demand

అమరావతిః చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు.. మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని, అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైఎస్‌ఆర్‌సిపి నేతలకే చెల్లిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జైలులోనే చనిపోతారంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు చెబుతున్నారని లోకేశ్ గుర్తుచేశారు. కేసులతో ఎలాంటి సంబంధంలేని నా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. స్కాంలతో తమకు కానీ, తమ పార్టీ నేతలకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎలాంటి సంబంధంలేదని లోకేశ్ స్పష్టం చేశారు. ఒకవేళ ఉందని మీ దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా ప్రజల ముందు పెట్టాలని వైఎస్‌ఆర్‌సిపి నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో పెట్టారని లోకేశ్ విమర్శించారు. ప్రజల నుంచి ఆయనను దూరం చేయడానికి, ప్రజా సమస్యలపై పోరాడకుండా అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఈ నాటకం ఆడుతోందని ఆరోపించారు. అంతే తప్ప చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని లోకేశ్ తెలిపారు. టిడిపి అధినేతను జైలులోకి పంపడంపై పెట్టిన శ్రద్ధను రాష్ట్రంలోని రైతుల సమస్యలను పరిష్కరించడంలో పెడితే బాగుండేదని అన్నారు. సౌత్ ఇండియాలోనే ఎన్ ఎస్ జీ ప్రొటెక్షన్ కలిగిన ఒకేఒక నేత చంద్రబాబు అని, ఆయనకు మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉండడంతో కేంద్రం ఈ రక్షణ కల్పించిందని చెప్పారు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైలులో పెట్టి, సరైన రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే తమకు అనుమానంగా ఉందన్నారు. తమ అధినేతను జైలులోనే అంతమొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోనని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.