హుజూరాబాద్‌లో సర్వే చేయించాను: ఎంపీ కోమటిరెడ్డి

ఈటల రాజేందర్‌కు 67 శాతం ఓట్లు..కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్ : హుజూరాబాద్‌ ఉన ఎన్నికలో బీజేపీ నేత ఈటల రాజేందర్ విజయం పక్కా అని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తేల్చి చెప్పారు. తాను చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు.

అయితే, కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. నల్గొండ, భువనగిరి లోక్‌సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు.

తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని ఆరోపించారు. నిన్న ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/