శాస‌న‌స‌భ‌లో కొత్త రెవెన్యూ చట్టం

cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ అసెంబ్లీలో చారిత్రాత్మ‌క‌ రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. కొత్త చట్టం వివరాలను వెల్లడించారు. ఈ చట్ట ప్రకారం తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని సర్వే చేయిస్తామని తెలిపారు. ప్రతి సర్వే నెంబర్‌కు కోఆర్డినేట్స్ ఏర్పాటు చేస్తామని.. ప్రతి భూమికి అక్షాంశాలు, రేఖాంశాలుగా కొలతలు నిర్దేశిస్తారని వెల్లడించారు. ఈ చట్టం వచ్చాక భూమి కోసం ఎవరూ గొడవ పడే ఘటనలు ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు కెసిఆర్‌. రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు సభా వేదికగా ప్రకటించారు.


అన్ని వివరాలతో కూడిన ధరణి పోర్టల్ రూపొందించాం. తెలంగాణ విస్తీర్ణం లక్షా 12వేల చ.కి.మీ. అంటే 2 కోట్ల 75 లక్షల ఎకరాలు. మన రాష్ట్రంలో కోటి 50 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమి ఉంది. 66.56 లక్షల అటవీ భూమి ఉంది. మిగిలింది వ్యవసాయేతర భూమి. ధరణి వెబ్‌సైట్ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా చూసుకోవచ్చు. కాపీ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెక్రటేరియెట్‌, అన్ని కలెక్టరేట్లతో పాటు దేశంలోని ఇతర సురక్షిత ప్రాంతాల్లోనూ సర్వర్లు ఉంటాయి. కొత్త చట్టం ప్రకారం ఏ స్థాయి అధికారికైనా విచక్షణాధికారం ఉండదు. ఏ స్థాయి వ్యక్తైన ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం ఉండదు. ఈసీ (encumbrance certificate) వివరాలు కూడా వెబ్‌సైట్‌లోనే లభిస్తాయి. దేనిపడితే దాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేసే వీలుండదు. ఆటో లాక్ సదుపాయం ఉంది.

ఇక వీఆర్వో, వీఆర్ఏలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు కెసిఆర్‌. ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని ఆయన చెప్పారు. వారికి ఆప్షన్లు ఇచ్చి ఇతర శాఖల్లో ఉద్యోగం కేటాయిస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని సిఎం తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/