ఆ ఆడియో నాదికాదు – ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

వికారాబాద్‌ జిల్లా తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో ఒకటి బుధవారం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో ఈరోజు మహేందర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆ ఆడియో నాదికాదంటూ చెప్పుకొచ్చారు. తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి జాతర కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉందని.. ఈ విషయంలోనే తాను సీఐతో మాట్లాడానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తెలిపారు. కానీ వైరల్ అవుతున్న ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. తాను సీఐని దూషించలేదని వివరణ ఇచ్చారు.

పోలీసులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. అధికారులంతా తాండూరు రావాలని కోరుకుంటారని.. తాను పోలీసులతో మంచిగా వ్యవహరిస్తానని మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. నకిలీ ఆడియో వ్యవహారంపై కోర్టునే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఇవన్నీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు నోటీసులు ఇస్తే విచారణను ఎదుర్కొంటానని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు.

ఏప్రిల్‌ 23న (శనివారం) తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఈ ఫోన్‌కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్‌లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సీఐ రాజేందర్‌రెడ్డి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ‘‘రౌడీ షీటర్లు వస్తే ఎట్లా ఊకున్నవ్‌. మరి నీవేం పీకుతున్నవ్‌’’ అని ఎమ్మెల్సీ అనగా.. ‘‘సార్‌ మంచిగా మాట్లాడండి’’ అని సీఐ అన్నారు.దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతూ ‘‘ ఏం పీకుతున్నావ్‌ రా…అరేయ్‌ రికార్డు చేయ్‌రా… కార్పెట్‌ వేస్తే ఏం చేస్తున్నావ్‌రా’’ అని ప్రశ్నించారు. దీనికి సీఐ స్పందించి.. ‘‘కార్పెట్‌ వేసే పని.. మాదా సార్‌ ?’’ అని బదులిచ్చారు. ‘‘రౌడీ షీటర్లకు ఎలా కార్పెట్‌ వేస్తారు?’’ అని ఎమ్మెల్సీ మరోసారి ప్రశ్నించారు. దీంతో ‘‘ఎమ్మెల్యే.. రౌడీ షీటరా?’’ అని సీఐ తిరిగి ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్యే వెంట ఉన్నవాళ్లు ఎవర్రా.. ? నువ్వు అనుకోవచ్చు బిడ్డా.. సీఐగా ఇక్కడి నుంచి వెళ్లిపోయినా నీ తాట తీస్తా.. రేపటి నుంచి నీ సంగతి చూస్తా’’ అంటూ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సీఐని హెచ్చరించారు.