రాజీనామా అనంతరం కొడాలి నాని ఏమన్నారో తెలుసా..?

ఏపీ సీఎం జగన్ ఆధ్యక్షతన జరిగిన కాబినెట్ సమావేశం అనంతరం మంత్రిమండలిలోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను సీఎం జగన్‌కు సమర్పించారు. అనంతరం మంత్రులు తమ ప్రోటోకాల్ వాహనాలు వెనక్కి ఇచ్చారు. మంత్రుల రాజీనామా పత్రాలను సీఎం జగన్ రేపు గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఇక ఈ సమావేశం అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ..జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని, మంత్రి పదవుల కంటే కూడా పార్టీ కోసం సేవలందించాలని సూచించిన మేరకు తామంతా కట్టుబడి రాజీనామాలు చేశామన్నారు.

11న కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. తమ కంటే ఎక్కువగా సీఎం జగన్‌ బాధపడ్డారని అయితే తామంతా జగన్‌కు మద్దతుగా ఉంటామని ధీమాను కల్పించామని చెప్పారు. తమ నాయకుడి కోసం తాను ఎలాంటి పదవులు చేపట్టడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక సీఎం జగన్‌కు సైనికుడిగా పనిచేయడమే తనకు అత్యంత ఇష్టమని మంత్రి అనిల్‌ కుమార్‌ అన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.