పంజాబ్ ముఖ్య‌మంత్రి చన్నీ మేనల్లుడి అరెస్ట్

ఎన్నికల సమయంలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్న చన్నీ

చండీగఢ్‌: పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయంలో అక్కడ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఈడీ అధికారులు దాడి చేశారు. చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ నివాసం, కార్యాలయాలపై దాడి చేసిన ఈడీ అధికారులు నిన్న అర్ధరాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. 2018 నాటి ఇసుక అక్రమ మైనింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

జనవరి 19న నిర్వహించిన దాడుల్లో రూ. 10 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు భూపీందర్ కు చెందిన స్థలాల్లో రూ. 8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. అక్రమ మైనింగ్ కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, కంపెనీలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే చర్యలను ప్రారంభించినట్టు ఈడీ తెలిపింది.

మరోవైపు తన మేనల్లుడిని ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం చన్నీ మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని విమర్శించారు. బీజేపీ కుట్రలకు తాము భయపడమని చెప్పారు. ఆ పార్టీ ఎన్ని కుట్రలకు పాల్పడినా పంజాబ్ లో గెలవడం అసాధ్యమని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/