కౌశిక్ రెడ్డిపై జీవిత రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత కౌశిక్ రెడ్డిపై సినీ నటి , బిజెపి నేత జీవిత రాజశేఖర్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. కౌశిక్ రెడ్డి ఒక పెద్ద రౌడీ అని, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సభకు జీవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..టీఆర్ఎస్‌ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దరించనోళ్లు.. బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తారా? అంటూ ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసమే బీఆర్ఎస్‌గా పేరు మార్చుకున్నారని, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ చెప్పుకుంటుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు.

కేసీఆర్ 9 ఏళ్లు సీఎంగా ఉండి కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలను నేరవేర్చలేకపోయారని అన్నారు. బంగారు తెలంగాణగా మారుస్తానని మాటలు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని జీవిత విమర్శించారు. అధికారమే పరమావధిగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని, కేసీఆర్‌ను అధికారం నుంచి దించేవరకు పోరు కొనసాగిస్తామని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే కౌశిక్ ఫై జీవిత నిప్పులు చెరిగారు. కౌశిక్ ఒక పెద్ద రౌడీ అని, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదని ఆరోపించారు. తన కుటుంబసభ్యుడిపై కౌశిక్ రెడ్డి పరుషంగా ప్రవర్తించాడని గతంలో జరిగిన ఘటనను జీవిత రాజశేఖర్ గుర్తు చేశారు.