ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యకుడు కాకుండా పోయాడు – లోకేష్

ఈరోజు బుధువారం ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ను వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై యావత్ టీడీపీ నేతలు , పార్టీ కార్యకర్తలే కాక నందమూరి కుటుంబ సభ్యులు , ఇతర పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ జగన్ కు భారీ షాక్ ఇచ్చింది.

వైస్సార్సీపీ పార్టీలో శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని సీఈసీ స్పష్టం చేసింది. ఏ పార్టీలోనూ శాశ్వత పదవులు అనేవి ఉండకూడదని, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది. అలాంటి ఎన్నిక.. నియమాలను ఉల్లంఘించినట్లేనని సీఈసీ పేర్కొంది. వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీకి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన వైస్సార్సీపీ ప్లీన‌రీలో భాగంగా వైస్సార్సీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడిగా జ‌గ‌న్‌ను ఆ పార్టీ స‌భ్యులు ఎన్నుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ జగన్ కు ఇచ్చిన షాక్ ఫై నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యకుడు కాకుండా పోయాడు అంటూ లోకేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రెండూ ఒకే రోజు జ‌రిగాయ‌ని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జ‌గ‌న్ భ‌విష్య‌త్తు ఏమిటోనన‌ని కూడా లోకేష్ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న ట్వీట్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైస్సార్సీపీ కి రాసిన లేఖ ప్ర‌తిని కూడా జ‌త చేశారు లోకేష్.