అధికారంలోకి రాగానే మళ్లీ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు పెడతాం – నారా లోకేష్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం ఫై టీడీపీ నేతలు , అభిమానులు , నందమూరి ఫ్యామిలీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ..టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్​ పేరు పెడతామని ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు చీకటి రోజని అన్నారు.

ఆనాడు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ప్రారంభించారని.. దానికి వైఎస్​కు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఒక సైకో.. ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులు జగన్ కొట్టేశారని ఆరోపించారు. తెలుగు జాతి ఉన్నంత వరకూ ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా ఉంటుందని తేల్చిచెప్పారు. అలాగే పేరు మార్పు ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్‌ మాదిరిగా తాను ఆలోచించి ఉంటే.. కడప జిల్లాకు వైఎస్సార్​ పేరు ఉండేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నీచ సంస్కృతికి తెరలేపారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్​ పేరు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.