తారకరత్న ఇక లేరు

నందమూరి తారకరత్న ఈరోజు శనివారం కన్నుమూశారు. గుండెపోటుకు గురై..బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయ లో చికిత్స తీసుకుంటున్న తారకరత్న ..క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని అంత అనుకున్నారు. కానీ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని ఎవ్వరు ఉహించుకోలేకపోతున్నారు. గత 22 రోజులుగా విదేశీ డాక్టర్స్ బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు డాక్టర్స్ ట్రై చేస్తున్నప్పటికీ ఆయన రెస్పాండ్ లేదు.

22 రోజుల క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. అప్పటి నుండి తారకరత్న కు చికిత్స అందజేస్తూ వస్తున్నారు. తారకరత్న క్షేమంగా తిరిగిరావాలని యావత్ నందమూరి అభిమానులు , ప్రజలు కోరుకుంటూ దేవుడ్ని ప్రార్ధించారు. కానీ దేవుడు కనికరించలేదు. మహాశివరాత్రి నాడే తారకరత్న ను తనదగ్గరికి తీసుకెళ్లాడు.

నందమూరి నట వారసుల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు తారకరత్న. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరుపున బరిలోకి దిగుతారని అంత భావించారు. కానీ ఇలా మరణిస్తాడని ఎవరు ఊహించలేదు. అయితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఇలా శివరాత్రి నాడు శివైక్యం చెందడం సంభవిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మహా శివరాత్రి నాడు మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. మరణం అన్నది ఏ మనిషి జీవితంలో అయినా, ఎప్పటికైనా రావాల్సిన ఘట్టమే అయినప్పటికీ అది ఏ పుణ్యకాలంలో వచ్చింది అన్నదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలా మహా శివరాత్రి రోజు మరణం రాదని వేదాల్లో, పురాణాల్లో వివరించబడింది.

తారకరత్న వయసు 40 ఏళ్లు. ఆయనకు భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక ఉన్నారు. తారకరత్నది ప్రేమ వివాహం. అలేఖ్య వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బంధువుల అమ్మాయి. అలేఖ్య టాలీవుడ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసేది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పట్లో కొద్దిమంది సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

తారకరత్న 2002లో ఒకటో నెంబరు కుర్రాడు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, విజేత, అమరావతి, నందీశ్వరుడు, ఎదురులేని అలెగ్జాండర్, మహాభక్త సిరియాళ, కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించారు. మొత్తం 23 చిత్రాల్లో హీరో, ప్రతినాయక, క్యారెక్టర్ రోల్స్ పోషించి మెప్పించారు. అమరావతి చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు కూడా లభించింది.