హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేయాలంటూ ఏపి ప్రభుత్వానికి ఈసీ ఆదేశం

EC orders AP government to set up SIT on violent incidents

అమరావతిః ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయనుంది. ఈసీ ఆదేశాల మేరకు సిట్ రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది.

ముఖ్యంగా, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున, ఆ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లపై సిట్ దృష్టి సారించనుంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క ఘటనపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయి.

ఇక, తాడిపత్రి ఘటనకు సంబంధించి డీఎస్పీ చైతన్య వైఖరిపైనా సిట్ నివేదిక రూపొందించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. విశాఖలో ఓ కుటుంబంపై వైసీపీ మద్దతుదారులు దారుణంగా దాడి చేసిన ఘటనను కూడా సిట్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.