తెలంగాణ బీజేపీ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం తో మిగతా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతల్లోనూ కొత్త ఉత్సహం మొదలైంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకొని , ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందని, తెలంగాణ బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీలోని ఈటల రాజేందర్ వంటి ఉద్యమనేతలే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిదని, ఎవరైనా పార్టీలోకి రావొచ్చని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన వారు పార్టీలోకి తిరిగి రావాలని ఈ సందర్బంగా కోరారు.

కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్ని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సానుకూలంగా స్పందించారని రేవంత్ రెడ్డి వివరించారు.